ఈ ఆట గుర్తుందా? పేరు చెప్పగలరా?
స్మార్ట్ ఫోన్ ప్రస్తుత సమాజాన్ని కట్టు బానిసల్ని చేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. అవసరమున్నా లేకపోయినా.. అలవాటుగానైనా అరగంటకో సారి సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకునే వాళ్లు అనేకం. ఇక పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌ల మోజుతో బయటకెళ్లటమే మానేశారు. అలా 10 ఏళ్ల క్రితం వరకు ఆడిన ఆటలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. వాటికి సంబంధించిన వీడియోలో, ఫొటోలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చినపుడు.. ‘‘ అరే! ఈ ఆట మా చిన్నప్పుడు భలే ఆడేవాళ్లం’’ అనుకోవటం పరిపాటిగా మారింది. గతం తాలూకూ జ్ఞాపకాలను తలుచుకుంటూ నిట్టూర్పు విడవటం మామూలైంది. ఈ లిస్టులో సామాన్య ప్రజలే కాదు ఉన్నత అధికారులు కూడా చేరిపోయారు. ఐపీఎస్ అధికారి దీపాన్స్ కాబ్రా తాజాగా ఓ పాత ఆటకు సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఈ ఆట గుర్తుందా? పేరు చెప్పగలరా?’’ అని నెటిజన్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆట ఎలా ఆడతారంటే : కొంతమంది పిల్లలు ఒకరి వెనకాల ఒకరు చేరి చేతులు ఎత్తి పట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య నుంచి తిరుగుతుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు పాడుతుండగా మిగిలిన పిల్లలు వారి చేతుల మధ్యనుంచి అలా రౌండ్లు తిరుగుతూనే ఉంటారు. పాట పాడటం పూర్తయిన వెంటనే ఆ ఇద్దరు చేతులు మూసేస్తారు. చేతుల మధ్య ఇరుక్కున్న వ్యక్తి అవుట్ అన్నమాట!. ఈ ఆటను ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారు. మరి మీ ఏరియాలో ఈ ఆటను ఏమని పిలిచేవాళ్లు.. ఏ పాట పాడేవాళ్లు.. ఓ సారి గతంలోకి వెళ్లి గుర్తు తెచ్చుకోండి!.