హాఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డు
ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కెన్యా అథ్లెట్ పెరెస్ జెప్‌చిర్చిర్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన రేసులో 27 ఏళ్ల పెరెస్ 21.0975 కిలోమీటర్ల దూరాన్ని గంటా 5 నిమిషాల 16 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ప్రేగ్‌లో గంటా 5 నిమిషాల 34 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును పెరెస్ తిరగరాసింది. కెజెటా (జర్మనీ–1గం:05ని.18 సెకన్లు), యాలెమ్‌జెర్ఫ్ యెహుఅలావ్ (ఇథియోపియా–1గం:05ని.19 సెకన్లు) రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో జేకబ్ కిప్లిమో (ఉగాండా) 58 నిమిషాల 49 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ హాఫ్ మారథాన్‌లో టైటిల్ నెగ్గిన తొలి ఉగాండా రన్నర్‌గా కిప్లిమో గుర్తింపు పొందాడు.