క్రికెట్‌లో వికెట్ల చరిత్ర తెలుసా..?

క్రికెట్‌లో వికెట్ల చరిత్ర తెలుసా..?\

క్రికెట్‌లో వికెట్ల చరిత్ర తెలుసా..?


క్రికెట్‌ ఇంగ్లాండ్‌లో ప్రారంభమైందన్న విషయం మనకు తెలుసు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ కాలనీల ద్వారా నార్త్ అమెరికాలో మొదలైన క్రికెట్ ఆ తరువాత 18వ శతాబ్దం నాటికి వెస్టిండీస్, ఇండియా వంటి అనేక బ్రిటీష్ కాలనీల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు అనేక దేశాల్లో ప్రధాన క్రీడగా మారిపోయింది. ముఖ్యంగా మన దేశంలో ఈ క్రీడ కోసం ప్రాణాలు పెట్టే అభిమానులున్నారు. అయితే క్రికెట్‌లో అత్యవసరమైన వికెట్లు(స్టంప్స్) గురించి మీలో ఎంతమందికి తెలుసు..? అసలు మూడు వికెట్లే ఎందుకుంటాయి..? రెండు ఉండొచ్చు కదా.. లేదా ఒక్కటి ఉండవచ్చు కదా.. లేదా కర్రలకు బదులు వెడల్పాటి చెక్క ముక్కను వినియోగించవచ్చుగా.. ఇలాంటి అనుమానాలు కచ్చితంగా మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి. అయితే అలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. క్రికెట్ ప్రారంభంలో వికెట్లుగా రెండు కర్రలను మాత్రమే వాడేవారు. వాటిపై ఒక్కటే బేల్(స్టంప్స్‌పై ఉండే కర్ర ముక్క) ఉండేది. అయితే ఇలా ఆడడం వల్ల ఒక్కోసారి బంతి రెండు వికెట్ల మధ్యలో నుంచి వెళ్లిపోయేది. అప్పట్లో హై స్పీడ్ కెమెరాలు, థర్డ్ అంపైర్లు లేకపోవడంతో బంతి వికెట్ల మధ్యలో వెళ్లినా తెలిసేది కాదు. దీనివల్ల బ్యాట్స్‌మెన్ అవుటైనా తెలిసేది కాదు. 1775లో జరిగిన ఓ మ్యాచ్‌లో లంపీ స్టీవెన్స్ అనే బౌలర్ వేసిన మూడు బంతులు నేరుగా రెండు వికెట్ల మధ్యలోనుంచి వెళ్లిపోయాయి. అయితే అది అవుట్ అని ఎవరూ ప్రకటించలేదు. ఈ మ్యాచ్‌తో వికెట్లను మార్చాలంటూ విపరీతంగా డిమాండ్ వచ్చింది. దాంతో రెండు వికెట్లకు మధ్యలో మూడో స్టంప్‌ను యాడ్ చేశారు. అలా మూడు స్టంప్స్‌తో క్రికెట్ ఆడడం మొదలైంది. అయితే మూడు వికెట్లపై ఒకటే బేల్ పెట్టడం వల్ల అది కింద పడడం కష్టమైంది. దంతో ఒక బేల్‌ను రెండు బేల్స్‌‌గా మార్చి ఇప్పుడు వికెట్లు ఉన్న రూపానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వికెట్ల ప్రాథమిక రూంపలో మార్పు రాకపోయినా సాంకేతికంగా మాత్రం అనేక మార్పులు వచ్చాయి. మొదట్లో ప్లాస్టిక్ వికెట్లను వినియోగించేవారు. అయితే రానురాను వాటి స్థానంలో చెక్క వికెట్లుగా తీసుకొచ్చారు.

గెలిచిన జట్టు వికెట్లను తీసుకెళ్లడం.. మ్యాచ్‌ ముగిశాక గెలిచిన జట్టు కెప్టెన్ లేదా ఆటగాళ్లు స్టంప్స్‌లో నుంచి ఓ వికెట్‌ను తీసుకెళ్లడం మీరు చూసే ఉంటారు. కానీ అలా వికెట్ ఎందుకు తీసుకెళ్తారో తెలుసా..? ఆ మ్యాచ్‌ గెలుపును గుర్తుంచడం కోసం. అవును మ్యాచ్‌లో తమ గెలుపునకు గుర్తుగా ఆ వికెట్‌ను కెప్టెన్ తన వద్ద ఉంచుకుంటాడు. ఇక వారు వికెట్ తీసుకెళ్లేటప్పుడు కచ్చితంగా మధ్య వికెట్‌ను వదిలి రెండు వైపులా ఉన్న వికెట్లను మాత్రమే తీసుకెళ్తారు. అది ఎందుకో తెలుసా..? మధ్య వికెట్లో కెమెరాలు, మైక్‌లు అన్నీ అమర్చి ఉంటాయి. వాటి వైర్లు పిచ్ గుండా వెళ్లి టెక్నికల్ రూం వరకు ఉంటాయి. ఈ కారణంగానే ఎవరూ మధ్య వికెట్‌ను ముట్టుకోరు. 2014లో వచ్చిన జింగ్ వికెట్స్(బంతి టచ్ కాగానే వెలిగే స్టంప్స్) వచ్చినప్పటి నుంచి ఆటగాళ్లు అలా వికెట్ల తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించారు. ఎందుకంటే సాధారణ వికెట్ల ఖరీదు కంటే ఈ వికెట్ల ఖరీదు చాలా ఎక్కువ. ఒక్కో సెట్ ఖరీదు దాదాపు రూ.50 వేల వరకు ఉంటుంది. అందుకే వీటిని తీసుకెళ్లడానికి అనుమతించరు. అయితే ప్రపంచకప్ వంటి పెద్ద పెద్ద టోర్నీల్లో ఫైనల్ గెలిచిన జట్టుకు మాత్రం వీటిని తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ అందుకోసం ముందస్తుగా అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.