క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు జరిపేందుకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
తెలంగాణలో హాకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. ఈ క్రీడాపాఠశాలల్లో 4, 5 తరగతుల్లో ప్రవేశాలు జరిపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ర్టానికి, దేశానికి వన్నె తెచ్చే క్రీడాకారులను అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏటీఎస్) ఆధ్వర్యంలో క్రీడా పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని త్వరలోనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కరోనా కారణంగా 2021-22 విద్యాసంవత్సరంలో 4 వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అందుకే ఈ ఏడాది 4, 5 తరగతుల్లో 15 క్రీడా విభాగాల్లో 240 సీట్లను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో క్రీడాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, క్రీడా పాఠశాల ఓఎస్‌డీ డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
GUIDELINES FOR SELECTION OF INMATES FOR ADMISSION INTO SATS SPORTS INSTITUTIONS : CLICK HERE